Saturday, March 5, 2011

సుస్వాగతమ్


అందరికీ నమస్కారం

ఈ ' వినయ్ ' అనే వినయ దత్త మా బాబే ! 

ఈరోజుకి అతడు పుట్టి సరిగ్గా పదకొండేళ్లయింది. 

తిథుల ప్రకారం ( 2000 వ సంవత్సరం ) ఆదివారం - అమావాస్య - అర్థరాత్రి పుట్టడం వల్లనేమో కొంత విలక్షణంగా వుంటాడు. ఎప్పుడూ ఉత్సాహంగా వుంటాడు. 



ఒక సంవత్సరం కాలం నుంచి నేను ' కూడలి ' ని తరచుగా సందర్శిస్తున్నాను. ఇది గమనించిన వినయదత్తా ' ఎప్పుడూ కూడలేనా ? ఎప్పుడూ తెలుగు బ్లాగులేనా ? ' అనేవాడు. అప్పుడు నేను ' కథామంజరి ' తదితర బ్లాగుల్లోని కథలు చదివి వినిపించాను. 

' శిరాకదంబం ' లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టపా ద్వారా ఆ గాన గంధర్వుడికి శుభాకాంక్షలు అందిస్తూ మా బాబు పేరును కూడా చేర్చాను. బాలు తాతగారంటే వాడికీ ఇష్టమే మరి. మా శుభాకాంక్షలకి స్పందించిన రావుగారు ప్రత్యేకంగా రెండు మాటలు మా బాబుని ఉద్దేశించి రాశారు. అప్పటికే కథలకి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ' అమ్మా ! నేను కూడా బ్లాగు రాస్తాను ' అన్నాడు. అడిగిందే తడవుగా ప్రయత్నించినా ఎందుకో మరి మొదలు పెట్టడానికే  కొంత ఆలస్యమైంది. మొత్తానికి అతడి  ఆలోచనకి, ఊహకి ఒక రూపం ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా వుంది. 

తెలుగు చదవడం, రాయడం రాకపోయినా అతని టపాలోని మాటలు అతనివే ! పదాలు మాత్రమే నావి. ఎప్పుడో ఒకసారి మీ ముందుకు వచ్చే వినయ దత్త ను ఆశీర్వదించగలరు. ఇదే వేదికను ఉపయోగించుకుని నేనూ కొన్ని టపాలు ప్రచురించగలను.

శుభాభినందనలతో............ 

మాధురి 
ప్రాణిక్ హీలర్ 
కాంట్రిబ్యూటర్, ఈనాడు 
చెన్నై